ఠాకూర్ తండా యువకుడి అసాధారణ విజయగాథ

డాక్టరేట్ సాధించిన డాక్టర్ మూడవత్ పరమేష్‌కు అభినందనల వెల్లువ.

ఠాకూర్ తండా యువకుడి అసాధారణ విజయగాథ

డాక్టరేట్ సాధించిన డాక్టర్ మూడవత్ పరమేష్‌కు అభినందనల వెల్లువ.

నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలం:

మారుమూల తండా నుండి ప్రారంభమైన ఒక యువకుడి విద్యా ప్రయాణం నేడు డాక్టరేట్ స్థాయికి చేరి అందరికీ ఆదర్శంగా నిలిచింది. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఠాగూర్ తండాకు చెందిన మూడవత్ పరమేష్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ నుండి పీహెచ్‌డీ పూర్తి చేసి “డాక్టర్” బిరుదును అందుకున్నారు.

పేదరికాన్ని జయించిన పట్టుదల:

అనేక ఆర్థిక ఇబ్బందులు, గ్రామీణ వెనుకబాటుతనం, కనీస వసతులు లేని పరిస్థితుల్లోనూ పరమేష్ తన చదువును ఎప్పుడూ ఆపలేదు. ప్రభుత్వ పాఠశాల నుంచే విద్యాభ్యాసాన్ని ప్రారంభించి, క్రమంగా ఉన్నత విద్యలో ప్రతిభ చాటుతూ దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు.ఠాగూర్ తండా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి వరకు చదివారు. అనంతరం వనపర్తిలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, పాలమూరు యూనివర్సిటీలో MA చదివారు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో M.Ed పూర్తి చేసి, కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు.

అంబేద్కర్ భావజాలంతో విద్యా సాధన

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని విశ్వసిస్తూ పరమేష్ తన ప్రయాణాన్ని కొనసాగించారు. సామాన్య కుటుంబానికి చెందిన ఒక యువకుడు కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత స్థాయికైనా చేరవచ్చని ఆయన నిరూపించారు.

గ్రామస్తుల హర్షం:

పరమేష్ డాక్టరేట్ సాధించడంతో ఠాగూర్ తండా గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు మరియు మేధావులు ఆయనను అభినందిస్తూ, ఈ విజయం మరెందరో పేద విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మిత్రుడు చెన్నయ్య రాథోడ్ మాట్లాడుతూ..

“పరమేష్ సాధించిన విజయం కేవలం ఆయన కుటుంబానిదే కాదు, మొత్తం తండాకు గర్వకారణం. ఆయన ప్రయాణం నేటి యువతకు ఒక మార్గదర్శకం” అని అన్నారు.